National Politics: నేడే అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. అయోధ్యలో కొలువుదీరనున్న రామయ్య

National Politics: Discussion on Ayodhya Temple in Lok Sabha today
National Politics: Discussion on Ayodhya Temple in Lok Sabha today

ఎన్నో ఏళ్ల నుంచి యావత్ భారతావని వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ దేశమంతా సంబురంలా అంగరంగ వైభవంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడనుంది. వేల మంది ప్రత్యక్ష భక్తులు, కోట్ల మంది పరోక్ష భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి వేయికళ్లతో మనసు నిండా రాముడి రూపం నింపుకుని అభిజిల్లగ్నంలో బాలరాముడు అయోధ్య గర్భగుడిలో కొలువుదీరే ఘట్టాన్ని వీక్షించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 1 గంటకు ముగియనుంది.

ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. యూపీ సర్కార్ బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసి రేడియోధార్మిక, రసాయన, బయో, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలనూ నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.