అయోధ్య రామ్మందిర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు అయోధ్యలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరయు నది ఘాట్ వద్ద హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అర్చకులు సరయు నదికి హారతి ఇచ్చారు. ఈ వేడుకను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘాట్ వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మరోవైపు ఈ క్రతువుల్లో భాగంగా శ్రీరాముడికి కానుకగా వచ్చిన బాహుబలి అగర్బత్తిని కూడా వెలిగించారు. ఇక ఈరోజు రామ్లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకోనుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ఊరేగించనున్నారు.
జనవరి 21, 22వ తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. అయోధ్యకు వచ్చే భక్తులు రామమందిరంతోపాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని ‘దివ్య్ అయోధ్య’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.