మరో మూడ్రోజుల్లో జరగనున్న అద్భుత ఘట్టం అయోధ్య రామమంది ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ బృహత్తర ఘట్టానికి సమయం దగ్గర పడుతున్నందున పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వేదమంత్రోచ్ఛరణల నడుమ అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని గురువారం రోజున గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా రామ్ లల్లా విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. బాలరాముడు ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాడు.
బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ ఎక్స్(ట్విటర్)లో ఈ ఫొటోను షేర్ చేశారు. 51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి తెల్లటి వస్త్రంతో కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నెల 2వ2న అత్యంత వైభవంగా జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి రామ్ లల్లా దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు.