సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ప్రకటించగా.. ఇప్పుడు భాజపా తమ ‘సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు కమలదళం తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. ‘‘మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత భారత్’ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, మహిళలు, పేదలు, యువత, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.