త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.
పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది. ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.