National Politics: CAA.. భారతీయ ముస్లింలకు హిందువులతో సమానంగా హక్కులు

National Politics: Supreme Court hearing on CAA on March 19
National Politics: Supreme Court hearing on CAA on March 19

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఈ చట్టం అమలు విషయంలో భారతదేశంలోని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హిందువులతో సమానంగా, ముస్లింల హక్కులు కొనసాగుతాయని తెలిపింది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఏ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతరులు, మైనారిటీలు 2014 డిసెంబరు 31లోగా ఇండియాకు వచ్చి ఉన్నట్లయితే వారికి సీఏఏ-2019 చట్టం ప్రకారం, భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. సీఏఏపై భారతీయ ముస్లింలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం మరింత స్పష్టతనిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మైనారిటీలు పీడనకు గురి కావడం వల్ల ఇస్లాం అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అపనింద వచ్చిందని, ఈ కళంకం నుంచి ఇస్లాం మతాన్ని సీఏఏ చట్టం రక్షిస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. భారతదేశంలోకి వలసవచ్చిన శరణార్థుల్ని వెనక్కి పంపే అంశమే ఈ సీఏఏ చట్టంలో లేదని, ముస్లింలు అపోహ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.