National Politics: జైలు నుంచే పరిపాలన చేయనున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్

National Politics: Delhi liquor scam case.. ED focused on Kejriwal's phone
National Politics: Delhi liquor scam case.. ED focused on Kejriwal's phone

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆ రాష్ట్ర సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది. అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్‌గా ఉంటున్న కేజ్రీవాల్‌ ఇప్పటివరకు మూడుసార్లు సీఎం బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడం వల్ల వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి.

అయితే, లిక్కర్ స్కామ్ కేసులో ఒకవేళ అరెస్టయితే కేజ్రీవాల్‌ సీఎంగా రాజీనామా చేయాలా అని గత డిసెంబరులోనే ఆప్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఆయనే పాలన సాగించాలని 90% మంది అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయాన్ని ఆప్ వెల్లడిస్తూ.. కేజ్రీవాల్‌ అరెస్టయినా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని తెలిపారు.