లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేసింది. పాంచ్ న్యాయ్ సూత్రం ఆధారంగా ఒక్కోన్యాయ్ కింద ఐదు హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వం వహించారు. యువత, మహిళలు, రైతులు, కూలీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ హామీలే తమను ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తాయని, అధికారాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.
పార్టీ మేనిఫెస్టోలో 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో రైతు న్యాయం, కార్మిక న్యాయం, భాగస్వామ్య న్యాయం, మహిళా న్యాయం, యువత న్యాయం వంటి 5 న్యాయాలు ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం రూ.లక్షతో పాటు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు, ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీని పార్టీ ప్రకటించింది. కుల గణన నిర్వహించి, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టో విడుదలకు ముందు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హామీల ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారం కింద 14 వేర్వేరు భాషల్లో ముద్రించిన హామీ కార్డులను దేశం అంతటా 8 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు.