National Politics: తమిళనాడు లోక్సభ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం

National Politics: Former CM is an independent candidate in Tamil Nadu Lok Sabha
National Politics: Former CM is an independent candidate in Tamil Nadu Lok Sabha

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 370కిపైగా సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా తమిళనాడులో ఎలాగైనా ఈసారి మెరుగైన ఫలితాలను సాధించాలని భావిస్తోంది. అందుకే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది ఈ రాష్ట్రంలోని కాషాయదళం. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం(ఓపీఎస్)ను తమ వైపునకు తిప్పుకొంది. ఆయణ్ను అన్నా డీఎంకేపైకి అస్త్రంగా ప్రయోగించే పనిలో పడింది.

రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి అభ్యర్థిని నిలపబోమని వెల్లడించింది. రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా 59 ఏళ్ల పి.జయపెరుమాళ్ పోటీ చేస్తున్నారు. అధికార డీఎంకే కూటమి తరఫున ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ నవాస్ కాని పోటీలో ఉన్నారు. అయితే ఈసారి అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీతో పాటు అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో తాను సులువుగా రామనాథపురం పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తాననే ధీమాతో పన్నీర్ సెల్వం ఉన్నారు.