బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షం వాకౌట్ చేయగా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బిహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బలపరీక్ష నిర్వహించారు.
మహాకూటమిని వదిలి ఎన్డీఏ గూటికి చేరినందున సీఎం నీతీశ్ బలపరీక్షను కోరారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన అవద్ చౌదరిని స్పీకర్‌గా శాసనసభ తొలిగించింది. స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 వచ్చాయి. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఉపసభాపతి చర్చను చేపట్టారు. తర్వాత నీతీశ్ కుమార్ విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టగా వాడివేడీ చర్చ జరిగింది.
బిహార్ శాసనసభలో 243 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వానికి 122 మంది మద్ధతు ఉంటే సరిపోతుంది. సభలో చర్చకు ముందే ముగ్గురు ఆర్జేడీ సభ్యులు జేడీయూవైపు కూర్చుకున్నారు. చర్చ ముగిసిన తర్వాత కాంగ్రెస్, ఆర్జేడీ వాకౌట్ చేయగా 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో నీతీశ్ విజయం సాధించినట్లు ఉపసభాపతి ప్రకటించారు.