మణికంఠన్ అనే వ్యక్తి తమిళనాడులోని తిరువారూర్ శాంతిభద్రతల విభాగంలో విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. రోజూలాగే ఆరోజు తన విధులు ముగించుకున్నాడు. భార్యా బిడ్డలతో షాపింగ్ వెళ్లి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. కొంతదూరం విలామల్ ప్రాంతం వద్దకు వెళ్లగానే భారీ ట్రాఫిక్ జామ్. అప్పటికే పది నిమిషాలు వేచి చూశాడు. అయినా ఒక్క వాహనం ఒక్క అడుగు కూడా కదలడం లేదు. ఏమైందోనని బైక్ను పక్కన బెట్టి చేతిలో చేతిలో చంటిబిడ్డతో ఆ వైపుగా వెళ్లాడు. అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఎటు వెళ్లాలో అర్థంగాక రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రించేందుకు అధికారులు ఎవరూ లేరు.
పరిస్థితి గమనించిన మణికంఠన్ చేతిలో చంటి బిడ్డతోనే నడిరోడ్డుపై నిల్చొని వాహనాలను ఒకటి తర్వాత మరొకటి పంపుతూ ట్రాఫిక్ సరి చేశారు. చేతిలో బిడ్డను పట్టుకొని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ మణికంఠన్ విధులు నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కాస్త ఎస్పీ దృష్టికి వెళ్లడంతో మణికంఠన్‌ని అభినందించి బహుమతి అందించారు.