బీజేపీ 10 సంవత్సరాల పాలనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టెన్ ఇయర్స్ బీజేపీ పాలన జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు అభివృద్ధి ముందుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఆదివారం యూపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించే రోడ్ మ్యాప్ బీజేపీ వద్ద సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ లోక్ సభ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదని.. వికసిత్ భారత్ నిర్మాణం కోసం జరుగుతోన్న ఎన్నికలు ఇవని ఆయన అన్నారు.అవినీతిపై చర్యలు తీసుకుంటే కొందరు తనపై గుర్రుగా ఉన్నారని ,కానీ అవినీతిపై యాక్షన్ తీసుకోవడం వల్ల ఇవాళ అనేకమంది కటాకటాల వెనుక ఉన్నారని తెలిపారు.ఎవరి బెదిరింపులకు తాను బయపడబోనని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ,కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు.