ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం : ప్రధాని మోదీ

PM Modi
PM Modi

మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామని అన్నారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.

మోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చి, బెంళూరులోని ఇస్రోను సందర్శించారు. చంద్రయాన్-3ని విజయవంతంగా జాబిల్లిపైకి పంపించిన శాస్త్రవేత్తలందర్ని అభినందించారు. వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలని అన్నారు.

‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రయాన్‌ – 3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ – 3 విజయంపైనే ఉంది. విజయం పట్ల శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధారణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది ’’ అని ప్రధాని మోదీ అన్నారు.