సోనియా సీరియస్‌ ఆదేశాలు

సోనియా సీరియస్‌ ఆదేశాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన రాష్ట్రాల్లో అధ్యక్షులను తప్పుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలో పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపినట్టు ట‍్విట్టర్‌ వేదికగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణంగా సోనియా ఆదేశాల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌, గోవా, మణిపూర్‌ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా.. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు గణేశ్‌ గోడియాల్‌ ప్రకటించారు.

ఇదిలా ఉండగా, సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం.. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్‌ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.