మాజీ సీఎం కొడుకుది హత్యే…వారే చేశారా ?

love-murder-karnataka

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఏపీకీ గవర్నర్‌గా పనిచేసి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ మూడు రోజుల కిందట మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనది సహజమరణం కాదని, హత్యేనని నిన్న విడుదలయిన పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. రోహిత్‌ ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్టు నివేదికలో వెల్లడి కావడంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు, కేసును క్రైమ్‌ బ్రాంచికి బదిలీ చేశారు. ఫోరెన్సిక్‌, క్రైమ్‌ బ్రాంచ్ బృందాలు రోహిత్ నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. అతడి తలపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రోహిత్‌ మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, అతడిది సహజ మరణమేనని ఆయన తల్లి ఉజ్వలా తివారీ పేర్కొనడం కూడా కాస్త తికమకగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. దక్షిణ ఢిల్లీ డిఫెన్స్ కాలనీలో రోహిత్ నివాసం వద్ద ఏడు సీసీటీవీ కెమెరాలు ఉండగా, రెండు పనిచేయకపోవడంపై మరింత అనుమానాలకు దారితీస్తుంది. ఈ కోణంలోనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రోహిత్ శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందినట్లు ఢిల్లీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ బుధవారం వెల్లడించారు. ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న శేఖర్‌ను అంబులెన్సులో మ్యాక్స్‌ సాకేత్‌ ఆసుపత్రికి తరలించగా, అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రోహిత్ హత్యలో కుటుంబసభ్యులపైనే పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీ తివారీ తనను కొడుకుగా అంగీకరించకపోవడంతో చాలా కాలం రోహిత్ న్యాయ పోరాటం చేశారు. 2012లో డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవడంతో అందులో పాజిటివ్‌గా తేలింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో 2014లో రోహిత్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించక తప్పలేదు.