జాగ్రత్త: తెలంగాణకు 400 కి.మీ దూరంలో మిడతల దండు ఉన్నాయా???

పంటలను నాశనం చేసే మిడతల దండు 1993 తర్వాత మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ATARI) x జోన్ డైరెక్టర్ డా.వైజీ ప్రసాద్ తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఈ మిడతల దండు ఉందని.. రాష్ట్రంలోకి అవి వస్తాయా? రావా? అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తోందని సమాచారం. అదేవిధంగా సరిహద్దు జిల్లాలోను అప్రమత్తం చేశామని… మిడతల కట్టడికి జనావాసాల్లో మందులు పిచికారీ చేయొద్దని సూచించారు.

కాగా వర్షాకాలంలో… సాయంత్రం పూట ఇంట్లో లైట్ ఆన్ చెయ్యగానే… దీపకాంతికి పురుగులు వచ్చినట్లు.. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోకి కోట్ల సంఖ్యలో మిడతలు వచ్చాయి. ఒక్కసారిగా ఇళ్లు, పంటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయి. ఏ వందో, వెయ్యో అయితే… పురుగు మందులు కొట్టి చంపవచ్చు. కానీ వచ్చినవి కోట్లలో ఉన్నాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో రైతులకు అర్థంకాక లబోదిబో మంటున్నారు. తమను ప్రభుత్వాలే ఆదుకోవాలనీ, చేతికి వచ్చే పంటల్ని అవి తినేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. నిజమే… ఆ మిడతలు ఎంత డేంజరంటే… ఏదైనా పంటపై వాలాయంటే… గంటల్లోనే మొత్తం ఆరగించేస్తాయి. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో పంటల్ని ధ్వంసం చేశాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలను ఆరగించేశాయి. ఇక రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై మిడతలు దాడి చేసినట్లు అంచనా వేస్తున్నారు. కాగా రాజస్థాన్‌లో కూడా 5 లక్షల హెక్టార్లలో పంటల్ని తినేయడంతో రైతుల్లో కలవరం మొదలైంది.తెలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాది అధికారులు వెల్లడిస్తున్నారు.