ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా రోజు రోజుకూ విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. ఆంక్షలు మరింత కట్టు దిట్టం చేశారు అధికారులు. ఆ ప్రాంతాల నుంచి ఎవ్వరూ బయటకు రాకుండా నిబంధనలు అమలులో ఉన్నాయి. నిత్యావసరాలు కూడా డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఏపీలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న నాలుగు జిల్లాల్లో నెల్లూరు కూడా ఉంది. 48 పాజిటివ్ కేసులు ఇప్పటికే నమోదైన విషయం తెలిసిందే. ఇంకా రావాల్సిన రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళన ఉన్న నేపధ్యంలో.. , మొత్తం జిల్లాలో ఉన్న పాజిటివ్ కేసులు ఎక్కడైతే నమోదయ్యాయో.. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా రెడ్ జోన్ లుగా ప్రకటించింది. ఇప్పటికే అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి.
అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా ఇక్కడ సమయం మరింత కుదించారు. ఉదయం తొమ్మిది గంటలకే అందరూ కూడా లాక్ డౌన్ పాటించాలి. తర్వాత అంతా ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవాలి. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా తీసుకుని ఇంటికి వెళ్లిపోవాలి. రోడ్డుపైన ఎవరూ కూడా తిరగకూడదన్న నిబంధన ఉంది. అయినప్పటికీ.. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై యథావిధిగా తిరుగుతున్న పరిస్థితి ఉంది.
పోలీసులు ఎంతలా వారిని వారిస్తున్నప్పటికీ బయటకొస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎసెన్షియల్ నీడ్స్ సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయిన కూడా పోలీసులు వారిపై ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్క నెల్లూరు నగరంలోనే కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరు డివిజన్ లను రెడ్ జోన్ లుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఎవరూ కూడా బయటకు రాకూడదనే ఒక నిబంధన ఉంది.
ఒకవేళ వాళ్ళకేమైనా నిత్యావసరాలు అవసరం ఉంటే పాలు లేదా మెడిసిన్ లాంటిది అవసరం ఉన్నా కూడా ఆ ప్రాంతాల నుంచి ఎవరూ కూడా బయటకు రాకూడదు. వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. నెల్లూరు రెవిన్యూ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ద్వారా నెల్లూరు నగరంలోని వారందరికీ కూడా ఎలాంటి అవసరమున్నా.. డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించారు. ఆ వెబ్ సైట్ ను ఆశ్రయిస్తే గనుక వారికి అవసరమైన ఆ వస్తువులు ఇంటికి చేరవేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. దానిని వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే కోరారు.