టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టుకి ఓపెనర్లుగా ఎవరు ఆడతారు..? అనే విషయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇంగ్లాండ్‌తో సోమవారం రాత్రి వార్మప్ మ్యాచ్‌లో టాస్ కోసం వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. వరల్డ్‌కప్‌లో జట్టు కూర్పుపై హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆడతారని చెప్పుకొచ్చిన కోహ్లీ.. నెం.3లో మాత్రం తాను బ్యాటింగ్‌కి వస్తానని స్పష్టం చేశాడు. దాంతో.. కోహ్లీ మాట తప్పాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలు విషయం ఏంటంటే? ఐపీఎల్ 2021 సీజన్‌లో కాస్త తడబడిన యువ హిట్టర్ ఇషాన్ కిషన్‌తో 10 రోజుల క్రితం మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ‘‘నువ్వు టీమిండియాకి ఓపెనర్‌గా సెలెక్ట్ అయ్యావు. కాబట్టి.. ఓపెనర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉండు’’అని భరోసా ఇచ్చాడు. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌లో చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్.. ఇంగ్లాండ్‌తో సోమవారం రాత్రి జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ 46 బంతుల్లో 7×4, 3×6 సాయంతో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడబోవట్లేదని విరాట్ కోహ్లీ తేల్చేశాడు.
‘‘ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు పరిస్థితులు చాలా భిన్నంగా కనిపించాయి. కానీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్ లేని టాప్ ఆర్డర్‌ని చూడటం కష్టమేనని అనిపిస్తోంది. వరల్డ్‌క్లాస్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడతాడు. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు టీ20 వరల్డ్‌కప్‌లో తాను ఓపెనర్‌గా ఆడతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు.
కానీ.. ఐపీఎల్ 2021లో బెంగళూరు టీమ్‌కి ఓపెనర్‌గా ఆడిన కోహ్లీ 119.46 స్ట్రైక్‌రేట్‌తో 405 పరుగులు చేయగా.. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు పంజాబ్ ఓపెనర్‌గా ఆడిన రాహుల్ 138.80 స్ట్రైక్‌రేట్‌తో 626 పరుగులు చేయగా.. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే అతని ఇన్నింగ్స్‌లో 30 సిక్సర్లు, 48 ఫోర్లు ఉండటం గమనార్హం. దాంతో రిస్క్ ఎందుకని తొలుత తాను ఓపెనర్‌గా ఆడాలనే ఆలోచనని విరమించుకున్నకోహ్లీ.. ఆ తర్వాత ఇషాన్ కిషన్‌ని కూడా తప్పించేసినట్లు తెలుస్తోంది.