బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి సెలబ్రెటీల మెంటల్ హెల్త్, డిప్రెషన్ మీద పెద్ద చర్చే నడుస్తోంది. తళుకు బెళుకులతో కనిపించే తారల వెనుక ఎన్నో చీకట్లు ఉంటాయని.. వాళ్ల జీవితాల్లో బయటికి చెప్పలేని విషాదం ఉంటుందని.. ఎవరికీ చెప్పుకోకుండానే చాలామంది కుంగిపోతుంటారని.. ఆ బాధలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని అర్థమవుతోంది.
గత దశాబ్ద కాలంలో చూస్తే పదుల సంఖ్యలో సెలబ్రెటీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలామంది సినిమా వాళ్లు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాక.. ప్రేమ అవకాశాలు బెడిసికొట్టి.. స్వచ్ఛమైన ప్రేమ కరవై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మరి సుశాంత్‌కు ఇందులో ఏం తక్కువైందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అతడికి అన్నీ ఉన్నట్లే కనిపిస్తోంది. ఆత్మహత్యకు పాల్పడాల్సిన తీవ్ర సమస్యలేవీ లేవనిపిస్తోంది. అయినా అతనెందుకు అలా చేశాడో?
సుశాంత్ చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్, మెంటల్ హెల్త్ మీద ఎక్కువ మాట్లాడుతున్న సెలబ్రెటీ దీపికా పదుకొనే. డిప్రెషన్ తీవ్ర సమస్యే అని.. దాన్ని విస్మరించొద్దని ఆమె గట్టిగా చెబుతోంది. ఈ విషయమై ఆమె ట్విట్టర్లో రోజూ ఒక మెసేజ్ పోస్ట్ చేస్తోంది. ఆమె ఇలా స్పందించడానికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు దీపిక డిప్రెషన్‌తో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆమె కూడా ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా చేసిందట.
కానీ ట్రీట్మెంట్ ద్వారా సమస్య నుంచి బయటపడింది. ఈ నేపథ్యంలోనే దీపిక ఇప్పుడు డిప్రెషన్ మీద వరుసబెట్టి ఒకే ట్వీట్ వేస్తున్నట్లుంది. ఐతే దీన్ని నెటిజన్లు మరోలా తీసుకుంటున్నారు. ఆమె రోజూ ఒకే ట్వీట్ పెడుతుండటంతో అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందంటూ మండిపడుతున్నారు. సుశాంత్ మరణాన్ని చాలామంది లాగే దీపిక కూడా ప్రచారం కోసం వాడుకుంటోందని.. ఇదొక పీఆర్ యాక్టివిటీలా మారిపోయిందని అంటూ ఆమెను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.