Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొందరు టీడీపీనేతలతో కలిసి రేవంత్ లాంఛనంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా..ఫైర్ బ్రాండ్ నేతగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ బాగానే ప్రాధాన్యం ఇచ్చింది. స్వయంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నివాసంలో రేవంత్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన చేత్తో స్వయంగా రేవంత్ కు స్వీటు తినిపించారు. కొత్త ప్రయాణం మొదలుపెట్టానంటూ రేవంత్.. కాంగ్రెస్ లో చేరుతున్న ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ లో చేరానని, తనతో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, అధికార టీఆర్ ఎస్ కు చెందిన నాయకులూ తన నాయకత్వంలో కాంగ్రెస్ లోకి వచ్చారని చెబుతూ అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోలను, రాహుల్ తనకు స్వీటు తినిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు.
గ్రూప్ ఫొటోలో రాహుల్ గాంధీ పక్కనే రేవంత్ రెడ్డి కూర్చున్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ వంటి నేతలు కూర్చున్నారు. రాహుల్ స్వయంగా కండువా కప్పడం, గ్రూప్ ఫొటోలో పక్కనే కూర్చోబెట్టుకోవడం, భుజం మీద చేయివేసి ఆలింగనం చేసుకోవడం చూస్తే…రాహుల్ రేవంత్ చరిష్మాను గుర్తించారని, పార్టీలో ముఖ్యమైన బాధ్యతలే ఆయనకు అప్పగిస్తారని భావించవచ్చు. అయితే ఈ విషయాన్ని నెటిజన్లు ఎవరూ ప్రస్తావించడం లేదు. వారి దృష్టంతా..రేవంత్ కు రాహుల్ స్వీటు తినిపిస్తున్న ఫొటోపైనే ఉంది. దీనిపై అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఫొటోలో కాంగ్రెస్ కండువాలు కప్పుకుని నేతలంతా చుట్టూ ఉండగా..కుడిచేత్తో స్వీట్ బాక్స్ పట్టుకుని ఎడం చేత్తో ఓ స్వీట్ రాహుల్ గాంధీ రేవంత్ కు తినిపిస్తున్నారు. దీనిపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు రాహుల్ గాంధీ ఇచ్చిన బహుమతి ఇదని, ఎడమ చేత్తో స్వీట్ తినిపిస్తున్నారంటే…హస్తం పార్టీ రేవంత్ కు చెయ్యిచ్చినట్టేనని, ఎడమ చేత్తో పెట్టింది ఏదైనా విషంతో సమానమని, రేవంత్ ను రాహుల్ గాంధీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం లేదని…ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.