సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్‌కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్‌పై నెటిజన్లు ధ్వజమెతున్నారు.
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ.
కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్‌పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్‌కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.