Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ రాజకీయాల్లో ఆరితేరారు. నిన్నటికి నిన్న గుజరాత్ ఎన్నికల్లో పాక్ పేరు చెప్పి ఓట్లు రాబట్టుకున్న ఆయన చాతుర్యాన్ని అంత తేలిగ్గా అంచనా వేయలేం. అయితే తెలివితేటలు ఒక్కోసారి వికటిస్తాయి కూడా. తమిళనాడు ఎన్నికల కోసం ఆయన విసిరిన ఉచ్చు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటోంది.2 జి స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే నేతలు రాజా, కనిమొళి నిర్దోషులు అని కోర్టు తీర్పు రాగానే సోషల్ మీడియాలో మోడీ మీద పేలిన జోకులు అన్నీఇన్నీ కావు. ” డీఎంకే అంటే ద్రవిడ మోడీ కళగం . నల్లధనాన్ని వెలికితీయలేదు. 2 జి కేసులో శిక్షలు పడలేదు. గంగానది ఇంకా అపరిశుభ్రం గానే వుంది. రాబర్ట్ వాద్రా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మనం మోడీకి ఓటు వేసింది మన సిమ్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేయడానికి మాత్రమే.” అంటూ ఓ నెటిజెన్ విసిరిన పంచ్ చూస్తే 2 జి కేసు ఉచ్చు నుంచి కాంగ్రెస్ ను తప్పించి మరీ మోడీ తన మెడకు చుట్టుకున్నాడని తెలియడం లేదా?.
తమిళ రాజకీయాల్లో డీఎంకే తో కలిసి నడవడానికి మోడీ మొగ్గుజూపుతున్నారని చెప్పడానికి ఇంకో ఉదాహరణ 2 జి కేసు నుంచి తప్పించుకున్న రాజా డీఎంకే అధినేత కరుణకు రాసిన లేఖలో యూపీఏ ని గద్దె దించడానికి చేసిన కుట్రలో యూపీఏ ఇరుక్కుపోయిందని, ఆ మాత్రం తెలుసుకోకపోవడం సిగ్గుచేటని అభివర్ణించారు. తన తప్పు లేదని కోర్టు తీర్పుతో రాజా సంబరపడడం ఓకే , కానీ నాడు ఆ కుంభకోణంలో లక్షా డెబ్భై వేల కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆరోపణలు చేసిన మోడీని ఒక్క మాట అనకుండా యూపీఏ ని రాజా తప్పుబట్టడం చూసిన చిన్నపిల్లవాడికైనా ఏమి రాజకీయం నడుస్తుందో అర్ధం అవుతోంది.
మోడీ ఎత్తుగడ వల్ల బీజేపీ తమిళనాట నాలుగు సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు గానీ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారడం ఖాయం. మోడీ వస్తే ఏది జరగదని జనం ఆశపడి ఓట్లు వేసారో అదే జరుగుతున్నప్పుడు వారికి కోపం రాకుండా ఉంటుందా ? దాన్ని సరైన సమయంలో వ్యక్తం చేయకుండా వుంటారా ?