Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ధర్మశాల వన్డేలో శ్రీలంక చేతిలో భారత్ ఘోర పరాజయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోయిన టీమిండియా అతని గైర్హాజరీలో భారీ ఓటమి మూటగట్టుకోవడంపై నెటిజన్లు అనేక జోకులు వేస్తున్నారు. అనుష్క శర్మతో పెళ్లికోసం వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ… భారత్ భంగపాటు చూసి… వివాహం రద్దు చేసుకుని మరీ వన్డే సిరీస్ ఆడటానికి స్వదేశం రావాలని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ సెటైర్ ను తెగ షేర్ చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ పెళ్లి వాయిదాపడింది. కోహ్లీ సాయంత్రమే వచ్చి జట్టులో చేరతాడని బీసీసీఐ ప్రకటించింది అన్నది ఆ సెటైర్ సారాంశం.
అలాగే ఇప్పుడే అందిన వార్త అంటూ కోహ్లీ-అనుష్క వివాహం రద్దు. విరాట్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లో రిపోర్ట్ చేయాలని రవిశాస్త్రి ఆదేశం అంటూ మరో సెటైర్ వేసుకుంటున్నారు. ఈ తరహాలోనే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ తో …నువ్వు లేకుండా నేను బతకలేను అన్నట్టు…దానికి స్పందనగా కోహ్లీ … నేను కూడా..అంటే … వారిద్దరినీ ఉద్దేశించి టీమిండియా కూడా విరాట్ లేకుండా మేముండలేము అనే అర్ధం వచ్చేట్టుగా డిట్టో అన్నట్టు … ఉన్న మరో సెటైర్ కూడా తెగ నవ్వు తెప్పిస్తోంది. అలాగే… టీమిండియా సభ్యులతో విరాట్ పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదు. అనుష్క ఇదే చెప్పింది అని అంటే.. వెంటనే వారంతా… అయితే ఈ రోజు మేమెవరం బ్యాటింగ్ చేయం అని వ్యాఖ్యానించినట్టుగా మరో సెటైర్ పేలుతోంది. కోహ్లీ తన పెళ్లికి ఆహ్వానించలేదనే భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇలాంటి నిరాశాజనక ప్రదర్శన చేశారు అని కూడా సెటైర్ వేసుకుంటూ.
టీమిండియా ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియా తీరుపై కొందరు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని.. కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు వస్తుంటాయని, కేవలం ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రాన.. గతంలోని అద్భుత ఆటను తక్కువ చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. సెటైర్ల పేరుతో సోషల్ మీడియాలో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ సెటైర్ల సంగతి పక్కనపెడితే..
ధర్మశాల వన్డే మాత్రం… ఓ విషయంలో బీసీసీఐతో పాటు.. క్రికెట్ అభిమానులకు కనువిప్పు కలిగించింది. టీమిండియా కెప్టెన్ గా చరిత్ర తిరగరాసిన ధోనీ ఘనతలు మర్చిపోయి… ఆయన వయసును ఎత్తిచూపుతూ ఇక జట్టు నుంచి తప్పించాలని సలహాలిస్తున్న వారి నోళ్లు నిన్నటి మ్యాచ్ తో మూతపడినట్టే. ధోనీలాంటి అపార అనుభవజ్ఞుడి అవసరం భారత జట్టుకు ఎంత అవసరమో ధర్మశాల వన్డే నిరూపించింది. 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి… అత్యంత దారుణ పరాభవం ముంగిట నిల్చున్న భారత్ .. కనీసం 112 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అయినా చేయగలిగిందంటే… ధోనీ.. అనుభవం, ప్రతిభే కారణం. ధోనీ గనక నిన్నటి మ్యాచ్ లో లేకపోతే ఏం జరిగేదో ఊహించలేం. భారత జట్టుకు తానెంతటి కీలకఆటగాడో ధర్మశాల వన్డేలో మరోసారి నిరూపించాడు ధోనీ.