శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ఓ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జాతీయ గీతాలను ఆలపించారు. ముందుగా టీమిండియా ఆటగాళ్లు భారత జాతీయ గీతాన్ని ఆలపించగా.. ఆ తర్వాత శ్రీలంక జాతీయ గీతం వంతు వచ్చింది. ఈ సందర్భంగా హార్దిక్.. శ్రీలంక ఆటగాళ్లతో కలిసి వారి దేశ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హార్దక్ శ్రీలంక జాతీయ గీతాన్ని ఆలపించడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హార్దిక్ ఓ ట్రూ మ్యూజిక్ లవర్ అని ఒకరంటే.. శ్రీలంక నమో నమో మాతా జాతీయ గీతానికి పాండ్యా ఫిదా అయ్యుంటాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు శ్రీలంక పట్ల తన ఉదారతను చాటుకుంటున్నాడని, ఈ మ్యాచ్‌లో రాణించేదేముండదని ట్వీట్ చేస్తున్నారు. ప్రత్యర్థిని గౌరవించడం అంటే ఇదేనని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో హార్దిక్(10) మరో మారు నిరాశపరిచాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ఊహించనట్లుగానే ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాళ్లు పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మనీశ్ పాండేపై వేటు పడగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ అవకాశం దక్కింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 164 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగగా, సూర్య కుమార్ యాదవ్(50), ధవన్(46) రాణించారు.