కోహ్లీని ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

కోహ్లీని ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమానికి అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌, మీనా హారిస్‌లు రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేశారు. ఇక అంతర్జాతీయ ప్రముఖులు రైతు ఉద్యమానికి మద్దతు తెలపడం పట్ల మన దేశ క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో సహా బాలీవుడ్‌ ప్రముఖులు కేంద్రానికి మద్దతుగా నిలవడమే కాక.. ఇండియాటుగెదర్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేశారు. తాజాగా వీరి జాబితాలోకి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా చేరారు.

‘‘విభేదాలు తలెత్తిన ఈ సమయంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో అంతర్భాగం. ఇక ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కొరకు అన్ని పార్టీలు, వర్గాలతో చర్చించి ఓ స్నేహపూర్వక పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు సమైక్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఇండియాటుగెదర్‌’’ అంటూ కోహ్లి ట్వీట్‌ చేశారు. ఇక దీనిపై నెటిజనులు విపరీతంగా మండిపడుతున్నారు. ‘‘నువ్వు మా కెప్టెన్‌ కాదు.. హిట్‌ మ్యాన్’’‌.. ‘‘రెండు పడవల ప్రయాణం మంచిది కాదు.. వివాదాస్పద అంశంలో ఎవరో ఒక్కరికే మద్దతుగా నిలవడం బెటర్’’‌.. ‘‘రైతుల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్‌.. నీకంటే రిహన్నా ఎంతో నయం’’ అంటూ నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు.