కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ఏళ్ల పాటు బాగానే కష్టపడ్డా గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకి టికెట్ ఇవ్వలేదు. అప్పట్నుంచి పార్టీలో అంత చురుగ్గా లేని ఖుష్బూ ఇటీవలే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది. అధికార అన్నాడీఎంకేను కేంద్రంలోని భాజపా నియంత్రిస్తున్న మాట వాస్తవమే కానీ.. తమిళనాట మాత్రం ఆ పార్టీ బలం, ప్రభావం అంతంతమాత్రం. కానీ ఖుష్బూ వచ్చీ రాగానే పార్టీలో ఒక వేడి పుట్టించింది. రోజూ వార్తల్లో నిలుస్తూ, పార్టీ కార్యక్రమాల్ని నడిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
తాజాగా మనుస్మృతి గురించి, మహిళల గురించి విడుదలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధినేత, ఎంపీ తిరుమవాలవన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆయనకు వ్యతిరేకంగా ఖుష్బూ భాజపా మహిళా నేతలతో కలిసి ఆందోళన బాట పట్టింది. రోడ్డు మీద ధర్నాకు కూర్చుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ట్విట్టర్లో ఇండియా వైడ్ ఖుష్బూ పేరు ట్రెండ్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఖుష్బూ మరో రకంగా కూడా ట్విట్టర్లో హాట్ టాపిక్ అయింది. ఆమె ధర్నాలో కూర్చున్న సందర్భంగా ఒక వీడియో బైట్ ఇచ్చింది. అది పార్టీకి సంబంధించిన వాళ్లే రికార్డ్ చేశారు. ఐతే ఖుష్బూ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే.. మధ్యలో పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆమెను ఆపి రిపీట్ అన్నారు. దీనికి ఖుష్బూ కోపంగా స్పందించింది. ఇదంతా కూడా వీడియోలో రికార్డయి ట్విట్టర్లోకి వచ్చేసింది. దీన్ని పట్టుకుని ఖుష్బూ వ్యతిరేకులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.