Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోడీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు విభిన్నరంగాలకు చెందిన వారు. కొందరు నాయకులు రాజకీయాల్లోకి రాకముందు తమ రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచితే, మరికొందరికి ఘనమైన రాజకీయ నేపథ్యం ఉంది. తొమ్మిదిమంది మంత్రుల్లో ఎక్కువమంది లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించి అత్యవసర పరిస్థితి సమయంలో జైలు శిక్ష అనుభవించారు.
ఉత్తరప్రదేశ్ లోని భాగ్పట్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యపాల్ సింగ్ 1980వ బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నతవిద్యావంతుడు కూడా. ఎంఎస్సీ, ఎంఫిల్, స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ, ప్రజాపరిపాలనలో ఎంఏ, నక్సలిజంపై పీహెచ్డీ చేశారు. ఐపీఎస్ అధికారి అయిన సత్యపాల్ సింగ్ కు అంతర్గత భద్రతా వ్యవహారాలపై మంచి పట్టుంది. ఆయనకు తెలుగు రాష్ట్రాలతోనూ అనుబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సేవలు అందించారు. గిరిజన సమస్యలు, మావోయిస్టుల ఉద్యమంపై పుస్తకం రాశారు. హోంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా పనిచేస్తున్నారు.
కేరళ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అల్పోన్స్ కన్నన్థానం 1979 బ్యాచ్, కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. కొట్టాయం జిల్లాలో విద్యుత్ సౌకర్యం లేని మనిమాల గ్రామంలో జన్మించిన అల్ఫోన్స్ తాను కలెక్టర్ అయిన తరువాత ఆ ప్రాంతాన్ని 100శాతం అక్షరాస్యత ఉన్న పట్టణంగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆక్రమణ కట్టడాల కూల్చివేతలతో ఢిల్లీ డెమాలిషన్ మ్యాన్ గా పేరుపొందారు. 1994లో టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100మంది ప్రపంచ యువనేతల జాబితాలో అల్ఫోన్స్ కు స్థానం దక్కింది. 2006, 2011లో కేరళలోని కంజిరాపల్లి నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1974 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన హర్దీప్ సింగ్ పూరికి విదేశీ విధానాలు, జాతీయ భద్రత అంశాల్లో అనుభవం, నైపుణ్యం ఉంది. దౌత్యరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న హర్దీప్ సింగ్ బ్రెజిల్, యూకె, ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్శిటీలోని హిందీ కళాశాలలో చదువుకునే రోజుల్లో జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో ఆయన క్రియాశీలకపాత్ర పోషించారు.
బీహార్ నుంచి విస్తరణలో చోటు దక్కించుకున్న రాజ్ కుమార్ సింగ్ 1975వ బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆరా లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కూడా ఉన్నత విద్యావంతుడు. ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పొందాక న్యాయవిద్య అభ్యసించారు. అనంతరం నెదర్లాండ్స్ లో ఉన్నత చదువులు చదివారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన రాజ్ కుమార్ సింగ్ కు పోలీసులు, జైళ్లకు సంబంధించిన విషయాల్లో మంచి అనుభవం ఉంది.
బీహార్ లోని బక్సర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్ కుమార్ చౌబే రాజకీయ జీవితం పాట్నా యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మొదలయింది. 1970ల్లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అత్యవరపరిస్థితి కాలంలో జైలు శిక్ష అనుభవించారు. బీహార్ అసెంబ్లీకి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. పలుశాఖలకు మంత్రిగా పనిచేశారు. మరుగుదొడ్ల నిర్మాణంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అశ్విన్ కుమార్ మహాదళిత్ కుటుంబాలకు 11వేల మరుగుదొడ్లు మంజూరు చేశారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, అప్పుడే ఆడపిల్లల కన్యాదానం పేరుతో ఆయన చేపట్టిన నినాదం బీహార్ లో బాగా ప్రచారం పొందింది. 2013లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో ఆయన కుటుంబంతో సహా అక్కడ చిక్కుకుపోయారు. ఆ విపత్తుపై ఆయన రాసిన పుస్తకం బాగా ప్రజాదరణ పొందింది.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివప్రతాప్ శుక్లా నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా సేవలందించారు. ఎనిమిదేళ్లపాటు మంత్రిగానూ పనిచేశారు. గోరఖ్ పూర్ యూనివర్శిటీలో లా చదివిన శివప్రతాప్ 1970ల్లో విద్యార్థి నాయకుడిగా రాజకీయజీవితం ప్రారంభించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. శివప్రతాప్ కు గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల సంస్కరణల్లో మంచి అనుభవం ఉంది.
దళితవర్గానికి చెందిన వీరేంద్రకుమార్ మధ్యప్రదేశ్ లోని టికంఘా నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఎంపీగా అపార అనుభవం ఉంది. ఆరుసార్లు లోక్ సభ సభ్యుడిగా పనిచేసిన వీరేంద్రకుమార్ ఎస్సీల జీవన స్థితిగతులను మెరుగుపర్చటం కోసం జీవితాన్ని అంకితం చేశారు. బాలకార్మిక వ్యవస్థపై ఆయన పీహెచ్డీ చేశారు. జేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 16 నెలల జైలుశిక్ష అనుభవించారు.
రాజస్థాన్ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న గజేంద్ర సింగ్ షెకావత్ ప్రగతి శీల రైతు. అతి సామాన్య జీవితం గడుపుతుంటారు. ప్రస్తుతం జోధ్ పూర్ ఎంపీగా ఉన్నారు. సామాజిక సేవలోనూ పేరుగాంచిన గజేంద్రసింగ్ క్రీడాభిమానికూడా. బాస్కెట్ బాల్ క్రీడాకారుడు అయిన గజేంద్రసింగ్ అఖిల భారత బాస్కెట్ బాల్ క్రీడాకారుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. జోధ్పూర్ లోని జై నారాయణ వ్యాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్ చేశారు. ప్రఖ్యాత బ్లాగింగ్ సైట్ ఖోరాలో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న రాజకీయ నాయకుడు.
అనంతకుమార్ హెగ్డే కర్నాటక లోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 28 ఏళ్ల వయసులోనే తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐదోసారి ఎంపీగా ఉన్నారు. గ్రామీణ భారతంపై మంచి అవగాహన ఉన్న అనంతకుమార్ గ్రామీణాభివృద్ధికోసం కదంబ అనే ఎన్జీవోను స్థాపించారు. ఆయనకు తైక్వాండో, కొరియా, మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉంది. ఇలా మోడీ క్యాబినెట్ విస్తరణలో బహుముఖ ప్రజ్ఞాశాలులకు చోటు కల్పించారు.