21 మంది మంత్రుల రాజీనామా.. త్వ‌ర‌లో కొత్త క్యాబినెట్‌

Resignation of twenty one ministers

క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభం కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది మంత్రులు రాజీనామా చేసిన‌ట్లు ఆ పార్టీ నేత, మాజీ సీఎం సిద్ధిరామ‌య్య తెలిపారు. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సిద్దిరామ‌య్య చెప్పారు. క్యాబినెట్ నుంచి మంత్రులంతా స్వ‌చ్ఛందంగా రిజైన్ చేసిన‌ట్లు తెలిపారు. కొత్త క్యాబినెట్‌ను రూపొందించాల‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేసారు. బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న మంత్రుల‌కు హ్యాట్సాప్ అంటూ ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీఎం కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి గుడ్‌బై చెబుతూ ఇప్ప‌టికే 12 మంది కాంగ్రెస్-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వారికి తోడుగా ఇవాళ మ‌రో ఎమ్మెల్యే న‌గేశ్ కూడా రాజీనామా చేశారు. అయితే న‌గేశ్‌ను కిడ్నాప్ చేశార‌ని జ‌ల‌వ‌ర‌న‌రుల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ తెలిపారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితిపై సీఎం హెచ్‌డీ కుమార‌స్వామి మాట్లాడారు. స‌మ‌స్య త్వ‌ర‌లోనే తీరుతుంద‌న్నారు. దీని గురించి ఆందోళ‌న లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం సాఫీగా సాగుతుంద‌న్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన‌ట్లే, జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఎంవో వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితిపై తాను ఎటువంటి ఉద్వేగానికి లోను కావ‌డం లేద‌ని, రాజ‌కీయాల గురించి చ‌ర్చించాల్సిన త‌న‌కు లేద‌ని సీఎం కుమార‌స్వామి తెలిపారు.