అప్పుడు ఇందిర…ఇప్పుడు నిర్మ‌ల

Nirmala Sitha Raman took Indira Gandhis place
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో క్యాబినెట్ మంత్రులుగా ప్ర‌మోష‌న్ పొందిన న‌లుగురికి, కొత్త మంత్రుల‌కు శాఖ‌లు  కేటాయించారు.  విస్త‌ర‌ణ‌లో తెలుగు రాష్ట్రాల‌కు మొండిచేయి చూపించిన ప్ర‌ధాని… ప్ర‌మోష‌న్ ఇచ్చిన నిర్మ‌లా సీతారామ‌న్ కు మాత్రం అత్య‌ధిక ప్రాధాన్యం క‌ల్పించారు. ఎవ‌రూ  ఊహించ‌ని రీతిలో ఆమెకు ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఇందిరాగాంధీ త‌రువాత ర‌క్ష‌ణ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న రెండో మ‌హిళ నిర్మలా సీతారామ‌నే.
విస్త‌ర‌ణ ముందు వ‌ర‌కు ఆ శాఖ బాధ్య‌త‌ను  ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ అద‌నంగా నిర్వ‌హిస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ఆ శాఖ‌ను ఇప్పుడు నిర్మలా సీతారామ‌న్ కు అప్ప‌గించారు. ఆమెతో పాటు ప్ర‌మోష‌న్ ఇచ్చిన , ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కు పెట్రోలియం శాఖ‌, ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీకి మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించారు. రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్ర‌భు రాజీనామా స‌మ‌ర్పించ‌టంతో ఆ శాఖ‌ను… ప్ర‌మోష‌న్ పొందిన పీయూష్ గోయ‌ల్ కు అప్ప‌గించారు. దాంతో పాటు బొగ్గు శాఖ బాధ్య‌త‌లు కూడా పీయూష్ గోయ‌ల్ నిర్వ‌హించాల్సి ఉంది.
ఇక కొత్త మంత్రులు ఆర్‌.కె. సింగ్ కు  స్వ‌తంత్ర హోదా ఉన్న విద్యుత్ శాఖ‌, ఆల్ఫోన్స్ క‌న్న‌త్‌థానం కు స్వ‌తంత్ర హోదా ఉన్న ప‌ర్యాట‌క శాఖ‌తో పాటు ఐటీ శాఖ స‌హాయ‌మంత్రి బాధ్య‌త‌లు, హ‌ర‌దీప్ సింగ్ కు స్వ‌తంత్ర హోదా ఉన్న గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లు అప్ప‌గించారు. స‌త్య‌పాల్ కు మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి, జ‌ల‌వ‌న‌రులు, ప్ర‌గ‌తి శీల రైతు అయిన గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ కు వ్య‌వ‌సాయం, రైతుసంక్షేమం, అశ్విన్ కుమార్ చౌబేకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, అనంత కుమార్ హెగ్డేకు నైపుణ్యాభివృద్ధి శాఖ‌, శివ‌ప్ర‌తాప్ శుక్లాకు ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి, వీరేంద్ర కుమార్ కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లు కేటాయించారు. కొన్ని శాఖ‌ల్లో చేసిన మార్పులుకార‌ణంగా స్మృతి ఇరానీకి స‌మాచార‌, జౌళిశాఖ‌,  రైల్వేమంత్రిగా రాజీనామా చేసిన సురేశ్ ప్ర‌భుకు వాణిజ్య ప‌న్నుల శాఖ అప్ప‌గించారు.