Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావత్ పై వివాదాలు పెరిగిన కొద్దీ ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. సినిమాలోని ఘూమర్ పాట యూ ట్యూబ్ లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే రాజ్ పుత్ ల ఆందోళన నేపథ్యంలో ఆ పాటలో దీపిక నడుము కనిపించడంపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ సీన్లు తొలగించాలని ఆదేశించింది. అయితే రాజస్థాన్ సంప్రదాయ నృత్యం ఘూమర్ కి అద్దం పట్టేలా ఘూమర్ సాంగ్ ను రూపొందించామని, ఆ సీన్లు తొలగిస్తే ఆ ఫీల్ పోతుందని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అన్నారు. సీన్లు తొలగించడానికి బదులుగా గ్రాఫిక్స్ తో కప్పివేస్తామని కోరారు. అందుకు సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. దీంతో ఆయా మార్పులు చేసి మళ్లీ ఘూమర్ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్.
కొత్తగా విడుదల చేసిన ఆ పాట నెట్ లో వైరల్ గా మారింది. పాత పాట వీడియో కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉండడంతో ఈ రెండు వీడియోలను నెటిజన్లు పోల్చిచూస్తున్నారు. బాగా పరీక్షించి చూస్తే కానీ తేడాలు కనిపెట్టలేనంతగా ఈ కొత్త వీడియో ఉంది. మొత్తానికి భన్సాలీ అటు సెన్సార్ బోర్డును ఒప్పిస్తూనే ఇటు తాననుకున్నదీ ప్రేక్షకులకు చూపించగలుగుతున్నారన్న టాక్ బాలీవుడ్ లో వినపడుతోంది. గతంలో ఇబ్బందులు ఎదురయినప్పటికీ… ఇప్పుడు మాత్రం పద్మావతికి అంతా పాజిటివ్ వాతావరణమే ఉందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సెన్సార్ బోర్డు అనుమతి, సినిమా విడుదలపై కొన్ని రాష్ట్రాలు విధించిన సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు ఎత్తివేయడం చిత్ర యూనిట్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రెండోసారి విడుదల చేసిన ఘూమర్ సాంగ్ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం చూస్తుంటే పద్మావత్ బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించనుందన్న వాదన వినపడుతోంది.