తెలంగాణాలో కొలువుతీరనున్న కొత్త మండల పరిషత్ లు

New Mandala Parishad in Telangana

తెలంగాణలోని మండలాల్లో నేటి నుంచి కొత్త పాలక వర్గాలు బాద్యతలు తీసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 537 మండల పరిషత్‌లకు నూతన సభ్యులను జూన్ 7న ఎన్నుకున్న సంగతి తెలిసిందే. వీటిలో 498 మండలాలాలో నూతన పాలక వర్గాలు నేటి నుంచి పాలన చేపట్టనున్నాయి. కొత్త పాలకవర్గాలు తొలి సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేయడంతో కొత్త పాలనకు మార్గం సుగమమైంది. పాత పాలకవర్గాల పదవీకాలం నిన్నటితో ముగియడంతో కొత్త పాలకవర్గాలు ఈరోజు నుండి పదవీ బాధ్యతలు చేపట్టనున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 112 మండల పరిషత్‌ల్లోనూ నేటి నుంచే కొత్త పాలన షురూ కానుంది. అయితే 29 మండల పరిషత్‌‌ల పదవీకాలం ఇంకా పూర్తికానందున అక్కడే పాత పాలక వర్గాలే కొనసాగనున్నాయి. ఆగస్టు 7న వాటిలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే వివాదాల కారణంగా మూడు చోట్ల ఎన్నికలు జరగలేదు. న్యాయ పరమైన చిక్కులు తొలగిన తర్వాత వాటికీ ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు