ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం ముగిసిన ఇటాలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీకి ముందు రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ 35 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు.
తాజా విజయంతో నాదల్‌ను వెనక్కి నెట్టి జొకోవిచ్ 36 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 7–5, 6–3తో విజయం సాధించాడు. చాంపియన్ జొకోవిచ్‌కు 2,05,200 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది జొకోవిచ్‌కిది నాలుగో టైటిల్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్లలో కూడా ఈ సెర్బియా స్టార్ విజేతగా నిలిచాడు.
ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ప్లిస్కోవా తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగింది. విజేత హలెప్‌కు 2,05,190 యూరోలు (రూ. కోటీ 77 లక్షలు) ప్రైజ్‌మనీగా దక్కాయి.