ప్రముఖ నటి భానుప్రియ ఇంటి పనిమనిషి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీబజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో మైనర్ బాలిక సంధ్యతో పాటు, ఆమె తల్లి ప్రభావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భానుప్రియ ఇంట్లో సంధ్య వేధింపులకు గురికాలేదని, దొంగతనం కేసు నుంచి బయటపడేందుకు భానుప్రియ మీద వాళ్ళు తప్పుడు ఫిర్యాదు చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు. భానుప్రియ ఇంట్లో దొంగతనం చేసింది నిజమేనని, తనను చూడడానికి వచ్చిన తల్లికి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ఖరీదైన వస్తువులు ఇచ్చి పంపిచేదాన్ని అని సంధ్య ఒప్పుకుంది. అలా దొంగిలించిన విషయం భానుప్రియకి తెలిసి.
తిరిగి ఇచ్చేయాలని అడగడంతో తన తల్లి కేసు పెట్టినట్టు మీడియాతో చెప్పింది. లక్షలు ఖరీదైన వాచ్లతో పాటు ఐపాడ్, ఐ ఫోన్, బంగారు నగలు తల్లికి పంపించినట్టు సంధ్య చెప్పింది. అయితే మైనర్ అమ్మాయిని ఇంటిలో పనికి పెట్టుకున్న వ్యవహారంలో భానుప్రియ, ఆమె సోదరుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. బాలకార్మిక చట్టం ప్రకారం ఇలా వ్యవహరించిన వారిపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని భానుప్రియ చెబుతున్నారు. అయితే మరి పోలీసులు ఈ అంశాన్ని బాలకార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ కేసులో భానుప్రియకి కాస్త ఊరట లభించిందనే చెప్పుకోవాలి.