క్ష‌ణానికో మ‌లుపు తీసుకుంటున్న క‌ర్నాట‌క రాజ‌కీయం

New-Twist-in-Karnataka-poli

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌క రాజ‌కీయాలు క్ష‌ణ‌క్ష‌ణానికీ మ‌లుపు తిరుగుతున్నాయి. తొలుత హంగ్ దిశ‌గా సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు… త‌ర్వాత బీజేపీకి అనుకూలంగా వ‌చ్చాయి. మ‌ధ్యాహ్నం వేళ‌కు బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని, అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించి, మ్యాజిక్ ఫిగ‌ర్ సాధించి సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటుచేస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ త‌ర్వాత బీజేపీకి షాక్ త‌గిలింది. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించినప్ప‌టికీ… మ్యాజిక్ ఫిగ‌ర్ కు కాస్త దూరంలో ఆగిపోయింది. ఇదే అద‌నుగా కాంగ్రెస్ వేగంగా పావులు క‌దిపి జేడీఎస్ కు గాల‌మేసింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డింది. కుమార‌స్వామితో పాటు జేడీఎస్ కు చెందిన ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. అప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు జేడీఎస్ కు మ‌ద్ద‌తుపై ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు కాంగ్రెస్, జేడీఎస్ గ‌వర్న‌ర్ ను క‌ల‌వాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయి.

అటు కాంగ్రెస్, జేడీఎస్ ఇంత దూకుడుగా ఉంటే… బీజేపీ మాత్రం మౌనంగా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించ‌ని గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల్లోనూ వ్యూహాత్మకంగా పావులు క‌దిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాష్ట్రంలో అధికారాన్ని వ‌దులుకుంటుందా… అన్న‌దానిపై సందేహాలు క‌లుగుతున్నాయి. క‌ర్నాట‌క‌ను వ‌దులుకోవ‌డానికి బీజేపీ ఎంత మాత్రం సిద్ధంగా లేద‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్య‌క్ష‌డు అమిత్ షా… తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నీ ప్ర‌చారం సాగుతోంది. 104 స్థానాల్లో గెలిచిన బీజేపీకి… మ‌రో 8 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంటే చాలు… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎనిమిది మందిని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం పెద్ద విష‌యం కాదు… అయినా స‌రే కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంటే… బీజేపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డానికి కార‌ణం… కాంగ్రెస్ లా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవ‌డానికి బీజేపీ సిద్ధంగా లేక‌పోవ‌డ‌మే… ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి… బీజేపీ అభ్య‌ర్థినే ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టాల‌న్న‌ది ఆ పార్టీ వ్యూహం… ప్ర‌స్తుతం అమిత్ షా… మోడీ ఆ ప‌నిలోనే త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఏ క్ష‌ణంలోనైనా బీజేపీ నేత‌లు త‌మ వ్యూహాన్ని వెల్ల‌డించ‌వ‌చ్చు.