మయూర్ పాన్ షాప్ పేరిట పలు రిటైల్ స్టోర్లు నిర్వహిస్తున్న ఉపేంద్ర వర్మ పై నమోదైన ఫేస్ బుక్ చీటింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఉపేందర్ వర్మ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తన జీవితాన్ని నాశనం చేశాడని ఓ యువతి ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలు సోనూకు పలువురితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉపేంద్ర వర్మ సోదరుడు సురేంద్ర వర్మ పలు ఫొటోలను మీడియాకు విడుదల చేసారు. సోనూ తమను గతంలో బ్లాక్ మెయిల్ చేసిందని, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ ఉపేందర్ భార్య ప్రీతీ వర్మ కూడా బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మరో పక్క అడిషనల్ పోలీస్ కమీషనర్ షికా గోయల్ ను కలిసిన సోనూ, ఉపేంద్ర కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.
నిన్న మీడియాతో మాట్లాడిన ఉపేంద్ర వర్మ సోదరుడు సోనూ కావాలనే తన సోదరుడిపై వల పన్ని ఇలా తప్పుడు కేసు పెట్టిందని, సోనూ గతంలో ఎంతో మందిని మోసం చేసిందని చెబుతూ, వేర్వేరు యువకులతో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలను మీడియాకు విడుదల చేశాడు. ఆమె తమ నుంచి కోటి రూపాయలను డిమాండ్ చేసిందని, ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన తరువాత కేసు పెట్టిందని ఆరోపించారు. ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిటీ పోలీస్ కమిషనర్ కు వివరణ ఇచ్చామని తెలిపాడు సురేంద్ర వర్మ.
మరోవైపు ఉపేందర్ వర్మ భార్య ఫిర్యాదుపై స్పందించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినందునే ఉపేంద్రను నమ్మానని చెప్పారు. సురేంద్ర ఆరోపిస్తున్నట్టుగా, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని, ఆ ఫొటోల్లో ఉన్న యువకుడు తన కాలేజీ స్నేహితుడని, ఒకప్పుడు అతనితో చనువుగా ఉన్నానని, ఆపై విభేదాలు రావడంతో తాము విడిపోయామని తెలిపారు. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోనూ ఆరోపించింది.