తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక ఆదివారం ఆత్మహత్య చేసుకున్న కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను ఒకింత షాక్ కు గురిచేసింది.
వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి ముందు నుండి చెబుతున్నప్పటికీ మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే కొద్దిసేపటి క్రితం గీతిక రాసిన సూసైడ్ నోట్ పోలీసులకి దొరకడంతో ఈ కేసు ముడి వీదినట్టే భావిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే గీతిక ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె రాసిన నోట్ యధాతధంగా
అమ్మా,
నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఎందుకో అమ్మా ఇక నాకు బతకాలని లేదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదమ్మా. అందరి గురించి ఆలోచించి, అందరు అమ్మాయిల్లాగా నాకూ భర్త, కుటుంబం.. అతని ప్రేమ కావాలనుకున్నా. కానీ, నా జీవితంలో నేను ఓడిపోయానమ్మా. తను లేకుండా నేను బతకలేను. కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా. నన్ను క్షమించు అమ్మా. నేను పిరికిదాన్ని కాదమ్మా. కానీ, నాకు వేరే దారి కనిపించలేదు. తను లేకుండా బతకలేను. అలా అని తనతో కలిసి బతకలేను. అందుకని వెళ్లిపోతున్నాను.
నన్ను క్షమించండి
ఇట్లు
పి. గీతిక
ఈ లేఖలోని అంశాలను లోతుగా విశ్లేషిస్తే , తల్లి తన ప్రేమ పెళ్లికి అంగీకరించక పోవడం వల్లే గీతిక సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వైద్య విద్యార్థిని గీతిక ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రేమ పెళ్లికి ఇంట్లోవారు అంగీకరించలేదు. ఈ కారణంగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుడింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది. అయితే చదువులో వత్తిడి వల్లే తన కుమార్తె గీతిక ఆత్మహత్య చేసుకుందని, మరే ఇతర కారణాలు లేవని ఆమె తల్లి హరితా దేవి చెప్తోంది.