ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ ఒకపట్టాన వీడేలా కనపడడంలేదు. మోక్షం కోసమే ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరణానికి ముందు ఏ విధమైన పెనుగులాట జరగలేదని శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాధమిక రిపోర్ట్‌లో తేలింది. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి ఆత్మహత్యల వెనుక మతపరమైన విశ్వాసాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షం కోసమే వీళ్లంతా సామూహికంగా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ చేసేకొద్దీ నమ్మలేని నిజాలతోపాటు.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి చుట్టుపక్కల పరిశీలించిన పోలీసులకు ఇంటి నుంచి గోడ ద్వారా బయటకు పెట్టిన 11 పైపులు కనిపించాయి. ఇవన్నీ కూడా ఆయా వ్యక్తుల వయస్సును బట్టి సైజులు ఉండటం విశేషం.
అన్నింటి కంటే పెద్ద పైపు గోడకి పైన ఉంది. ఇది ఆ ఇంటిలో వృద్ధురాలు చనిపోయి పడి ఉన్న గది నుంచి బయటకు వచ్చింది. ఈ పైపు సైజు పెద్దదిగా ఉంది. ఇక మిగతా 10 పైపులు.. మిగతా వాళ్లు చనిపోయిన గది నుంచి బయటకు వచ్చి ఉన్నాయి. వాటిలో నాలుగు పెద్దవిగా ఉండగా.. మిగతావి చిన్నవిగా ఉన్నాయి. చనిపోయిన వ్యక్తుల వయస్సు ఆధారంగా పైపుల సైజులు కూడా వేర్వేరుగా ఉండటం విశేషం. అంతే కాకుండా వారు చనిపోయి ఉన్న గది నుంచి ఈ పైపులు బయటకు వచ్చి ఉండటం మరో విశేషం. దీంతో స్థానికులే కాదు పోలీసులూ షాక్ కు గురయ్యారు. ఈ పైపులు ఎందుకు పెట్టారు అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. సామూహిక హత్యలా, ఆత్మహత్యలా అనేది కూడా ప్రస్తుతానికి తేల్చలేకపోతున్నారు. విచారణ చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతోపాటు.. ఓ రిజిస్టర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవుడు – మోక్షమార్గం అనే అంశాలు రాసి ఉన్నట్లు చెబుతున్నారు.
అంతేకాక వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల లక్షణాలు కూడా అందులో పేర్కొన్నారు. గురువారం లేదా శనివారాన్ని ఎంచుకోవాలి. తల చుట్టూ వస్త్రాన్ని గట్టిగా కట్టుకోవాలి. శారీ, దుపట్టాతో తాడుకేసి బిగించాలి. చనిపోయే వారం రోజులకు ముందే కర్మకాండలు నిర్వహించాలి. అదికూడా చాలా నిష్ఠగా పాటించాలి. ఈ రోజుల్లో ఎప్పుడు ఆత్మ ఆవహిస్తే ఆ మరుసటి రోజే మీ పని పూర్తి చేయాలి. ఒకవేళ వృద్ధురాలు నిలబడలేకపోతే ఆమెను పక్క గదిలో పడుకోబెట్టవచ్చు. మసక వెలుతురు ఉపయోగించాలి. చేతికి కట్టుకున్న గుడ్డ మిగిలితే… ఆ గుడ్డముక్కను కళ్లకు కట్టుకోవాలి. నోటిని గుడ్డతో గట్టిగా కట్టేయాలి. ఎంత అంకిత భావంతో ఈ పనిచేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. అర్థరాత్రి 12 నుంచి 1 లోపు ఇది జరగాలి. దీనికంటే ముందు పూజలు చేయాలి. అందరికీ ఒకే ఆలోచనలు ఉండాలి. ఇలా మీరు చేయగలిగితే మంచి ఫలితం పొందుతారు..’’ అని ఆ రిజిస్టర్లో రాసి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.