హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరంలో ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారన్న సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మైలార్ దేవ్ పల్లిలో ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. గతేడాది అరెస్ట్ అయిన అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఎన్ఐఏ సోదాల్లో బయటపడిన విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఢిల్లీలో ఓ వీహెచ్‌పీ నేత హత్యకు అబ్దుల్ బాసిత్ వేసిన పథకాన్ని భగ్నం చేసిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్‌కు పారిపోయివచ్చాడు. అనంతరం ఇక్కడ కొంత మంది యువకులతో కలిసి ఉగ్రదాడులకు వ్యూహరచన చేయడంతో బాసిత్‌ను పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, మరోసారి అంతర్జాలం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించినట్టు గుర్తించడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కింగ్స్ కాలనీలోని ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు, బాసిత్, అతడితోపాటు అదుపులోకి తీసుకున్న ఇద్దరి సహచరుల కుటుంబసభ్యులను ప్రశ్నించారు. అలాగే తహా అనే అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.