కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన ఆదేశాలు

YSR Congress chief YS Jaganmohan Reddy Attacked With Knife At Visakhapatnam Airport

వైసీపీ అధ్యక్షుడిపై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, కాబట్టి దీనిని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు, దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. దీంతో కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. అప్పటి నుండి ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో ఇటీవలే చార్జ్‌షిట్ సైతం ఎన్ఐఏ దాఖలు చేసింది. అయితే, ఎన్ఐఏ విచారణపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మీదట ఈ కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అంతే కాదు, విచారణకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచురణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసు దర్యాప్తు అనంతరం సమర్పించిన నివేదికలోని పేర్కొన్నట్టు నిందితుడు శ్రీనివాస్ ఉద్దేశపూర్వకంగానే దాడిచేసినట్టు ఎన్ఐఏ కూడా పేర్కొంది.