గత రెండు సెషన్స్‌లో దేశీయ సూచీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. అదే ఊపును దేశీయ సూచీలు మంగళవారంన కొనసాగించలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల అంశాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీసింది. దీంతో దేశీయ సూచీలు నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 435.24 పాయింట్లు లేదా 0.72 శాతం క్షీణించి 60,176.50 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు లేదా 0.53 శాతం క్షీణించి 17,957.40 వద్ద ముగిశాయి. కాగా గత రెండు సెషన్లలో దేశీయ సూచీలు దాదాపు 3.5 శాతం చొప్పున పెరిగాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థల విలీన ప్రకటనతో సోమవారం సూచీలు భారీ లాభాలను గడించాయి. ఈ ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థల షేర్లు భారీగా పెరిగాయి. కాగా మంగళవారం ఇరు సంస్థల స్టాక్స్ భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.