Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
13,500 కోట్ల రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఋణం ఎగవేసిన కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోడి హాంగ్‌కాంగ్‌లో ఉంటున్నట్లు భారత్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు పలు దేశాలను నీరవ్ మోడీని తమకు అప్పగించేందుకు సహకరించాలని కోరింది. దీని కోసం పలు దేశాలకి భారత్ దౌత్యపరంయిన లేఖల్ని వ్రాసింది. ఈ క్రమంలోనే భారత్ రాసిన లేఖ మీద చైనా స్పందించింది. స్థానిక చట్టాలు, ఇరు దేశాల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా హాంకాంగ్… నీరవ్ మోడీ అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటుందని చైనా తెలిపింది. అలాగే, నీరవ్ మోడీని అరెస్ట్ చేసే విషయంలో హాంకాంగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. నీరవ్, మెహుల్ చోక్సిలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. దర్యాప్తునకు సహకరించాల్సిందిగా వారిద్దరి అధికారిక ఈమెయిల్ ఐడీలకు సీబీఐ సమాచారం పంపించగా వ్యాపార, ఆరోగ్య కారణాలు చూపించి నిరాకరించారు.
సీబీఐ విజ్ఞప్తి మేరకు ముంబయి కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది. ఇప్పుడు బెయిలుకు వీలు కాని వారెంట్లు జారీ చేయడంతో ఇంటర్‌పోల్ నుంచి రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయవచ్చు. నీరవ్ మోడి, మెహుల్ చోక్సి, వారి సంబంధీకులకు 1,590 లెటర్ ఆఫ్ అండర్‌స్టాం డింగ్స్(ఎల్‌ఓయు)లను పిఎన్‌బి జారీ చేసింది. నిరవ్ మోడీకి, ఆయన బంధువులకు, నిరవ్ మోడీ గ్రూపు కంపెనీలకు 1,214 ఎల్‌ఓయూలను, మెహుల్ చోక్సి ఆయన బంధువుల, గీతాంజలి గ్రూప్ కంపెనీలకు 377 ఎల్‌ఓయూలను పిఎన్‌బి జారీ చేసింది. ఇప్పటికే హాంగ్ కాంగ్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేసినట్లు పలు మీడియా ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. మరికొద్ది రోజుల్లోనే నీరవ్ మోడీని భారత్‌కు తీసుకొచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని పేర్కొన్నాయి.