నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్‌ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా, పవన్ గుప్తా వేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
2012లో నిర్భయ ఉదంతం జరిగే నాటకి తన వయస్సు 16 సంవత్సరాల 2 నెలలేనని…కాబట్టి తనకు జువనైల్ చట్టం ప్రకారం శిక్ష విధించాలని పవన్ కోరాడు. తన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పవన్ గుప్తా పిటిషన్ వేశాడు. ట్రయల్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్లపై కూడా స్టే ఇవ్వాలని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టును కోరారు. ఇప్పటివరకు పవన్ ఏ న్యాయపర అవకాశాలు వినియోగించుకోలేదని తెలిపారు.
అయితే, తాజాగా పవన్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టేయడంతో శిక్ష అమలుకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. కానీ, మరోవైపు డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలని మరో దోషి అక్షయ్ కుమార్ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అనంతరం కోర్టు ఇచ్చే తీర్పు తర్వాత ఉరి పై తుది నిర్ణయం వస్తుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.