రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఆమె నగరానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. కొద్దిసేపు మ్యాచ్ను తిలకించిన నీతా రాత్రి 9.10 గంటల ప్రాంతంలో ఎల్లమ్మ గుడికి చేరుకున్నారు. గుడి ఆవరణలోని పోచమ్మ, నాగదేవత ఆలయాలను కూడా ఆమె సందర్శించారు. హండీలో కానుకలు సమర్పించారు. అలా ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్-2019 ఫైనల్లో ముంబయి జట్టు ఒక్క పరుగు తేడాతో గెలిచి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. తన జట్టు ఫైనల్లో తలపడుతున్నా నీతా అంబానీ మ్యాచ్ మధ్యలోనే వెళ్లి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆమె మొక్కులు ఫలించే ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిందని సోషల్మీడియాలో ముంబై ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నీతా అంబానీ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారన్న సంగతి తెలిసిందే.