దేశంలో మ‌ళ్లీ నోట్ల క‌ష్టాలు… తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కొర‌త‌

No cash boards back at ATMs in India

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

న‌గ‌దు క‌ష్టాల‌తో దేశ‌ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో తలెత్తిన ఇబ్బందుల‌నే ప్ర‌స్తుత‌మూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఏటిఎంలు, బ్యాంకులు ముందు వేలాడుతున్న నో క్యాష్ బోర్డులు చూసి బెంబేలెత్తుతున్నారు. అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు సైతం డ‌బ్బు అందుబాటులో లేక తీవ్ర అవ‌స్థ‌లు పడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్నాట‌క, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, బీహార్, గుజ‌రాత్, ఢిల్లీలో క‌రెన్సీ కొర‌త తీవ్ర రూపం దాల్చింది. సోమ‌వారం నుంచి ఈ ఇక్క‌ట్లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. రెండు రోజుల నుంచి డ‌బ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నామ‌ని, ఎక్క‌డ‌చూసినా నో క్యాష్ అనే క‌నిపిస్తోంద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి 2016 న‌వంబ‌ర్ లో రూ. 1000, రూ. 500 నోట్లు ర‌ద్దుచేస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న తర్వాత దేశంలో క‌రెన్సీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. త‌మ ద‌గ్గ‌రున్న నోట్లు మార్చుకుని, కొత్త నోట్లు తీసుకునేందుకు తొలిరోజుల్లో బ్యాంకుల‌కు ప‌రుగులు తీశారు సాధార‌ణ ప్ర‌జ‌లు. క్యూలైన్ల‌లో డ‌బ్బుల కోసం సామాన్యులు అప్ప‌ట్లో ప‌డిన అవ‌స్థ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మొద‌ట మోడీ తీసుకున్న నిర్ణ‌యం చాలా మంచిద‌నిపించ‌గా… డ‌బ్బుల కోసం రోజుల త‌ర‌బ‌డీ ప‌డిన క‌ష్టాలు… ఆ నిర్ణ‌యంపై దేశ‌ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు క‌లిగించాయి. అయితే ఆర్ బీఐ స‌కాలంలో రూ. 2వేల నోటును, కొత్త రూ. 500, రూ. 200 నోటును మార్కెట్ లోకి విడుద‌ల‌చేయ‌డంతో నెమ్మ‌దిగా క‌రెన్సీ క‌ష్టాలు తగ్గిపోయాయి. కానీ ఇది తాత్కాలిక ఔష‌ధ‌మే అని తేలిపోయింది. మూడు నెల‌లుగా మ‌ళ్లీ దేశంలో నోట్ల ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. ఏపీ, తెలంగాణ‌ల్లో న‌గ‌దు కొర‌త తీవ్రమయింది. వాస్త‌వానికి నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఆర్ బీఐ దాదాపు రూ. 5ల‌క్ష‌ల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు ముద్రించింది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు ఏప్రిల్ 6నాటికి రూ. 18.17ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు చ‌లామ‌ణిలో ఉంది.

పెద్ద‌నోట్ల ర‌ద్దుచేసే ముందు చ‌లామ‌ణిలో ఉంది కూడా ఇంత‌మొత్త‌మే. అయిన‌ప్ప‌టికీ క‌ర‌న్సీకొర‌త ఏర్ప‌డ‌డానికి కార‌ణం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన అప‌న‌మ్మ‌క‌మే… అని తెలుస్తోంది. నోట్ల ర‌ద్దు స‌మ‌మంలో ఎదురయిన ఇబ్బందుల‌తో పాటు వ‌రుస‌గా వెలుగుచూస్తున్న బ్యాంకు కుంభ‌కోణాలు ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై అప‌న‌మ్మ‌కాన్ని క‌లిగించాయని, ఫ‌లితంగా బ్యాంకుల్లో డిపాజిట్లు త‌గ్గుతున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. డిపాజిట్లు తగినంత‌గా లేక‌పోవ‌డం వ‌ల్లే న‌గ‌దు కొర‌త ఏర్ప‌డింద‌ని విశ్లేషిస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 15.3శాతం పెర‌గ‌గా, 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో మాత్రం కేవ‌లం 6.7శాతంగానే ఉంది. దీంతో పాటు బ్యాంక్ క్రెడిట్లు కూడా పెరిగిపోయాయి. డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి న‌గ‌దు రొటేష‌న్ అవుతుంటుంది. ప్ర‌స్తుతం డిపాజిట్లు త‌గ్గ‌డంతో న‌గ‌దుకొర‌త ఏర్ప‌డింది. దీంతో బ్యాంకులు ఏటీఎంలో మ‌నీ ఉంచ‌లేక నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నాయి. దీన్ని గ‌మ‌నిస్తే… నోట్ల ర‌ద్దుకు కార‌ణంగా మోడీ చెప్పిన క్యాష్ లెస్ క‌రెన్సీ ల‌క్ష్యం నెర‌వేరే బ‌దులు… అస‌లు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యే ప్ర‌మాద‌ముందన్న హెచ్చ‌రిక‌లు విన‌ప‌డుతున్నాయి.