తాము ఉంటోన్న ఐసోలేషన్ వార్డులో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోపాటు శానిటైజేషన్ చేయట్లేదని కోవిడ్ రోగులు ఆందోళనకు దిగారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతూ ఆస్పత్రి సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటన శుక్రవారం ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరకాశీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మహదేవ్ ఉనియాల్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఆస్పత్రిలో కరోనా బారిన పడ్డ ముగ్గురు వలస కార్మికులు తాము ఉంటోన్న ఐసోలేషన్ వార్డు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
శానిటైజేషన్ సరిగా లేదని, కనీసం మెడికల్ రిపోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు అందించడం లేదంటూ నిరసనకు దిగారు. అందులో ఉన్న ఒకరు ఐసోలేషన్ వార్డులో ఉన్న సౌకర్యాలపై వీడియో చిత్రీకరించాడు. మాస్కులు ధరించకుండా తిరుగుతూ బీభత్సం సృష్టించారు. వీరి నిర్లక్ష్య వైఖరిపై తలలు పట్టుకున్న ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా, ఆ ముగ్గురు వలస కార్మికులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ప్రధాన వైద్యాధికారి డా.ఎస్‌డీ సాక్లానీ కరోనా పేషెంట్లు ఉండే వార్డులను రోజుకు పలుమార్లు శానిటైజేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా బాధితులకు అవసరమైన సదుపాయాలతో పాటు, సహాయ సహకారాలు అందించేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.