చంద్రయాన్ 2 మిషన్ ద్వారా చేపట్టిన విక్రమ్ ల్యాండర్ అంశంలో ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి క్షణాల్లో విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ కావడంతో సిగ్నల్స్ కోల్పోయింది. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ కు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ ఉపగ్రహం తన కెమెరాతో ఫోటో తీసింది. కొత్త చిత్రాలను, పాత చిత్రాలను పోల్చి చేసి విక్రమ్ ఆచూకీ కోసం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నీడ ప్రాంతంలో కానీ, కెమెరా చిత్రీకరించని చోట కానీ విక్రమ్ ల్యాండర్ ఉండి ఉండవచ్చునన్నారు.విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలో సూర్య రశ్మి తక్కువ ఉంటుందని, దీంతో ఫోటోలు మసక మసకగా కనిపిస్తున్నాయని నాసా పేర్కొందని చెబుతున్నారు.
విక్రమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 21వ తేదీ తర్వాత ఆ ప్రాంతంలో రాత్రి సమయం ప్రారంభమవుతుంది. 14 రోజుల పాటు చీకటి ఉంటుంది. దీని వల్ల చెలరేగే మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో విక్రమ్‌లోని పరికరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. చంద్రుడిపై ఏర్పడే అతి శీతల ఉష్ణోగ్రత వల్ల చీకటి ప్రాంతాన్ని మంచు కప్పేస్తుంది. సూర్య రశ్మి ఉండదు. 14 రోజుల తర్వాత కానీ సూర్యరశ్మి రాదు. అప్పటికి ల్యాండర్‌లోని సోలార్, సిగ్నలింగ్ వ్యవస్థలు పనిచేసే స్థితిలో ఉండాలి. కానీ కష్టమే. కాబట్టి ఈ రెండు రోజుల్లో సంబంధాలు ఏర్పరుచుకోకుంటే దీనిపై ఆశలు శాశ్వతంగా వదులుకోవాలి.