Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓవైపు ఇండియాలో డిఫాల్టర్ గా ముద్ర పడింది. ఇంగ్లండ్ లో మ్యాచ్ కు వెళితే ఇండియన్ ఫ్యాన్స్ నోటికొచ్చినట్లు తిట్టారు. మరోవైపు లండన్ కోర్టులో కేసు విచారణ నడుస్తోంది. ఇంత జరుగుతున్నా జల్సారాయుడు మాల్యా మాత్రం దిలాసాగానే ఉన్నారు. తను నిరపరాధిగా బయటపడటం ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మాల్యా ధీమా చూసి మహామహా ఆర్థిక నేరగాళ్లకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది.
కానీ మాల్యా ధీమాకు కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది. ఏకంగా లండన్ కోర్టు జడ్జే భారత్ అధికారులకు తలంటడంతో విషయం బహిర్గతమైంది. మాల్యాకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలున్నాయని చెబుతున్న అధికారులు.. కోర్టులో మాత్రం ఇంతవరకూ వాటిని ప్రవేశపెట్టలేదు. దీంతో ఈసారి వాయిదాకు సాక్ష్యాలు ఇవ్వకపోతే కేసు కొట్టేస్తానని జడ్జి ఫైరయ్యారట.
దీంతో విదేశాల్లో మరోసారి ఇండియా పరువు పోయింది. ఓవైపు ప్రధాని మాల్యాను అప్పగించాలని లాబీయింగ్ చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో అధికారులు షరామామూలుగా తమ నిర్లక్ష్యాన్ని చూపించడం… అందరికీ చికాకు తెప్పిస్తోంది. 9వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడిపై కనీస స్థాయిలో సాక్ష్యాలు చూపించకపోతే ఎలాగని లండన్ కోర్టు ప్రశ్నించడంతో.. కేంద్రం అప్రమత్తమై సదరు అధికారులకు అక్షింతలు వేసిందట. చూద్దాం.. ఈసారి వాయిదాలో అయినా భారత్ అధికారులు ఏం చేస్తారో..