స్వ‌దేశంలో ప‌ర్య‌టిస్తున్న నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మలాలా

Noble Prize Winner Malala First Visit Tour To Her Own Country Pakistan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దాదాపు ఆరేళ్ల త‌ర్వాత నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూస‌ఫ్ జాయ్ స్వ‌దేశం పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. నాలుగు రోజుల పాటు మ‌లాలా పాక్ లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. గురువారం ఉద‌యం త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఇస్లామాబాద్ లోని బెన‌జీర్ భుట్టో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం చేరుకున్న మలాలాకు స్థానిక పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా మ‌లాలా ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను పాక్ అధికారులు ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు.

త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌లాలా ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి షాహిద్ అబ్బాసీతో భేటీ అయింది. అనంత‌రం మీడియాతో మాట్లాడిన మ‌లాలా భావోద్వేగానికి గుర‌యింది. ఐదున్న‌రేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ స్వ‌దేశానికి రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, సొంత మ‌నుషుల మ‌ధ్య తిరిగి స్వ‌దేశంలో కాలుపెట్టాన‌ని ఆనందం వ్య‌క్తంచేసింది.

విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు త‌న‌కు పాకిస్థాన్ గుర్తుకువ‌చ్చేద‌ని చెబుతూ క‌న్నీరు పెట్టుకుంది. తాను పాక్ లో ఎలాంటి భ‌యం లేకుండా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌తో శాంతియుతంగా గ‌డ‌పాల‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపింది. బాలికా విద్య‌, మాన‌వ‌హ‌క్కుల కోసం ప్రచారం చేసిన మ‌లాలాపై 2012 అక్టోబ‌ర్ 9న పాకిస్థాన్ లో తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు దాడిచేశారు. స్కూల్ బ‌స్సులోకి చొర‌బ‌డి ఉగ్ర‌వాదులు ఆమెపై కాల్పులు జ‌రిపారు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఆమె ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత మెరుగైన చికిత్స కోసం మ‌లాలాను ఆమె త‌ల్లిదండ్రులు బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హామ్ కు తీసుకువెళ్లారు.

అనంత‌రం బ్రిట‌న్ ప్ర‌భుత్వం మ‌లాలాకు ఆశ్ర‌యం ఇచ్చింది. ఆమె అక్క‌డే ఉండి చ‌దువుకుంటోంది. బ్రిట‌న్ లోనే పాఠ‌శాల విద్య పూర్తిచేసింది. మాన‌వ‌హ‌క్కులు, బాలిక‌ల‌విద్య కోసం  చేసిన పోరాటానికి గానూ 2014లో మ‌లాలా భార‌తీయుడు కైలాశ్ స‌త్యార్థితో క‌లిపి నోబెల్ శాంతి బ‌హుమ‌తి అందుకుంది.