Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్, సింగపూర్ లాంటి మాటలు మానుకోవాలని, మాటలు మాని చేతలు మొదలుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంపై తమకు నమ్మకం లేదని, హోదా ఉద్యమాలపై ఆయన ఆంక్షలు పెడుతున్నారని రామకృష్ణ ఒంగోలులో ఆరోపించారు. ఉద్యమాలు చేసే వారి మాయలో పడొద్దని అసెంబ్లీలో సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. జపాన్ తరహాలో ఉద్యమించాలని చంద్రబాబు చెబుతున్నారని, జపాన్ లో అవినీతికి పాల్పడితే ఉరితీస్తారని, ఇక్కడ కూడా అలా చేస్తారా అని రామకృష్ణ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందింస్తామన్నారు.
అవిశ్వాసంపై అన్ని రాజకీయ పార్టీలు నోటీసులిచ్చినా ఇంతవరకూ ఆ అంశాన్ని చర్చకు రానీయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే ఒకరినొకరు తిట్టుకుంటూ అంతకంతకూ దిగజారిపోతున్నారని విమర్శించారు. రాజకీయనాయకులు ఎలా ఉన్నప్పటికీ…ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నా కేంద్రానికి వినిపించంలేదని రామకృష్ణ మండిపడ్డారు. హోదా కోసం తాము చేయనున్న ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1న విద్యార్థి జేఏసీ చేపట్టిన ఆందోళనకు మద్దతిస్తామని చెప్పారు. ఏప్రిల్ 5న రాత్రి 7 గంటలనుంచి 7.30 గంటల వరకు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ డేగా పాటిస్తామని, ఇందుకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. హోదా కోసం ఏప్రిల్ 7న కడపలో భారీ ర్యాలీ చేపడతామని వెల్లడించారు.