ఇస్రో జీశాట్-6A ప్ర‌యోగం విజ‌య‌వంతం

ISRO Successfully Launches GSLV Rocket GSAT-6A Communication Satellite

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌మ్యూనికేష‌న్ల రంగంలో భార‌త్ ఇక కొత్త చ‌రిత్ర సృష్టించనుంది. ఇస్రో ప్ర‌యోగించిన అత్యంత శ‌క్తిమంత‌మైన క‌మ్యూనికేష‌న్ శాటిలైట్ జీశాట్-6ఏ  విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్ర‌వేశించింది. సాయంత్రం 4.56 గంట‌ల‌కు నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్ నుంచి జీశాట్-6ఏ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్ ఎల్ వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా జీశాట్ ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి పంపారు. 17 నిమిషాల 46 సెక‌న్ల వ్య‌వ‌ధిలో ఉప‌గ్ర‌హం  నిర్ణీత క‌క్ష్య‌లోకి చేరింది.

ఇస్రో చైర్మ‌న్ కె. శివ‌న్ ప్ర‌యోగాన్ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంపై శివ‌న్ తో పాటు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తంచేశారు. ప‌ర‌స్ప‌రం అభినంద‌న‌లు తెలుపుకున్నారు. ఎస్ బ్యాండ్ క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హాల్లో జీశాట్-6 ఏ ఉప‌గ్ర‌హం రెండ‌వ‌ది. ఈ ప్ర‌యోగం ఉప‌గ్ర‌హాల ద్వారా న‌డిచే మొబైల్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌నుంది. మ‌ల్టీ బీమ్ క‌వ‌రేజీ సౌక‌ర్యం ద్వారా దేశ‌వ్యాప్తంగా మొబైల్ క‌మ్యూనికేష‌న్ అందిస్తుంది. జీ శాట్ -6 ఏలో విచ్చుకునే యాంటెన్నాను ఏర్పాటు చేశారు. ఆరు మీట‌ర్ల వెడ‌ల్పు ఉండే ఈ యాంటెన్నా ఉప‌గ్ర‌హం కక్ష్య‌లోకి చేర‌గానే గొడుగులా విచ్చుకుంటుంది. ఈ ఉప‌గ్ర‌హం కోస‌మే దీన్ని ప్ర‌త్యేకంగా రూపొందించారు. సాధార‌ణంగా ఇస్రో ఉప‌యోగించే యాంటెనా కన్నా ఇది మూడు రెట్లు పెద్ద‌ది. చేతిలో ఇమిడిపోయే భూత‌ల టెర్మిన‌ళ్ల ద్వారా ఎక్క‌డినుంచైనా మొబైల్ క‌మ్యూనికేష‌న్లు సాగించ‌డానికి ఇదివీలు క‌ల్పిస్తుంది.

రాకెట్ రెండో ద‌శ‌లో అధిక విస్ఫోట‌నం క‌లిగిన వికాస్ ఇంజిన్, ఎల‌క్ట్రో మెకానిక‌ల్ ఆక్టేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేసిన‌ట్టు శాస్త్ర‌వేత్తలు తెలిపారు.  జీశాట్ -6ఏ  విజ‌యం ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అంకిత‌మ‌ని శివ‌న్ ప్ర‌క‌టించారు. ప్రయోగాన్ని విజ‌య‌వంతం చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు, స‌హ‌క‌రించిన కుటుంబ స‌భ్యుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.  తొమ్మిదినెల‌ల్లో 10 మిష‌న్ల‌కు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని శివన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది చంద్ర‌యాన్ 2 ప్రయోగం కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.